మధ్యలోకి వస్తే ఖబడ్దార్.. మళ్లీ వెంటబడి ఓడిస్తాం: మంత్రి శ్రీధర్ బాబుకు కవిత మాస్ వార్నింగ్

  • సింగరేణి బాయిబాట కార్యక్రమంలో పాల్గొన్న కవిత
  • కార్మికుల హక్కుల సాధన కోసం పోరాడుతామని భరోసా
  • కార్మికులను కలవకుండా పోలీసులు ఆంక్షలు పెడుతున్నారని మండిపాటు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో నిర్వహించిన సింగరేణి ‘బాయిబాట’ కార్యక్రమం తీవ్ర రాజకీయ వేడిని రగిల్చింది. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును టార్గెట్ చేస్తూ తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. "కార్మికులకు, మాకు మధ్య రావాలని చూస్తే ఖబద్దార్. గతంలో చేసిన తప్పులకే నిన్ను వెంటబడి ఓడించాం. మళ్లీ అదే పునరావృతమైతే వచ్చే ఎన్నికల్లోనూ నిన్ను వెంటాడి మరీ ఓడిస్తాం" అంటూ మంత్రి శ్రీధర్ బాబుకు ఆమె మాస్ వార్నింగ్ ఇచ్చారు.


బాయిబాట కార్యక్రమంలో భాగంగా కల్వకుంట్ల కవిత అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు అండర్‌గ్రౌండ్ మైన్‌లోకి దిగి కార్మికులతో ముఖాముఖి మాట్లాడారు. నల్లబొగ్గు బావుల్లో కార్మికులు పడుతున్న కష్టాలను, ప్రాణసంకట పరిస్థితులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఒక కార్మికుడు తను అనుభవిస్తున్న ఇబ్బందులను వివరిస్తుండగా కవిత తీవ్ర చలనానికి లోనై మైన్ లోపలే కంటతడి పెట్టారు. కార్మికులకు తాము ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని, హక్కుల సాధన కోసం పోరాడుతామని భరోసానిచ్చారు.


అనంతరం బొగ్గు గని వద్ద నిర్వహించిన భారీ గేట్ మీటింగ్‌లో కవిత మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వంపై, సింగరేణి యాజమాన్యంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉత్తర తెలంగాణకు ఆర్థిక వెన్నెముకగా నిలిచిన సింగరేణి సంస్థకు ప్రస్తుత ప్రభుత్వమే పెద్ద విద్రోహిగా మారిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి దాదాపు రూ. 50 వేల కోట్ల బకాయిలు పెట్టడం వల్లే సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. అధికారులకు ప్రొడక్షన్ టార్గెట్లు పెంచడంపై ఉన్న శ్రద్ధ... కార్మికులకు కనీస సౌకర్యాలు, ఆధునిక పనిముట్లు కల్పించడంపై లేదని మండిపడ్డారు.


"అండర్‌గ్రౌండ్ మైనింగ్‌లో మెషినరీని అప్‌గ్రేడ్ చేయడం లేదు. మ్యాన్ చైర్ మీద 45 నిమిషాల పాటు ప్రయాణించడం వల్ల కార్మికులు తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నారు. సింగరేణిలో ఇప్పటికీ బ్రిటిష్ కాలం నాటి దోపిడీ వ్యవస్థ నడుస్తోంది. జేఎంఐటీ లో ఉన్న వారికి తొమ్మిదేళ్లు గడుస్తున్నా ప్రమోషన్లు ఇవ్వకుండా అధికారులు వేధిస్తున్నారు" అని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.


తాను సింగరేణి కార్మికులను కలవకుండా ఉండేందుకు గత నాలుగు రోజులుగా పోలీసులు ఆంక్షలు పెడుతూ అడ్డుకుంటున్నారని కవిత ఆరోపించారు. అసలు సింగరేణి పరిధిలోకి పోలీసులకు అనుమతే లేదని, గేట్ మీటింగ్‌కు వస్తే కార్మికుల జీతాలు కట్ చేస్తామని యాజమాన్యం బెదిరించడం దుర్మార్గమన్నారు. ఒక్క కార్మికుడి జీతం కట్ చేసినా తాను ఇక్కడే గని ముందే ధర్నాకు కూర్చుంటానని హెచ్చరించారు. రాబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో హెచ్ఎంఎస్ (HMS) ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.


Kalvakuntla Kavitha
Sridhar Babu
Singareni Collieries
Baibata Program
Telangana Politics
Karimnagar News

More Telugu News